నేడు నెల్లూరు

Saturday, October 2, 2010

వైయస్ జగన్ క్యాంప్ పై చర్యల వెనక నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ?

కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన నెల్లూరు జిల్లా నాయకులపై కాంగ్రెసు అధిష్టానం ఆఘమేఘాల మీద చర్యలు తీసుకోవడం వెనక కాంగ్రెసు సీనియర్ నాయకుడు నేదురమల్లి జనార్దన్ రెడ్డి హస్తం ఉందని భావిస్తున్నారు. పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి ఓదార్పు యాత్రలో పాల్గొన్న ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై గానీ శాసనసభ్యుడు శివరామిరెడ్డిపై గానీ అధిష్టానం ఇప్పటి వరకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. ముఖ్యమంత్రి రోశయ్యపై, పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన శానససభ్యురాలు కొండా సురేఖపై కూడా కఠినమైన చర్యలేవీ తీసుకోలేదు. కానీ, నెల్లూరు జిల్లాలో జగన్ ఓదార్పు యాత్రకు ఏర్పాట్లు చేస్తున్న పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి, డిసిసి అధ్యక్షుడు గోపాల్ రెడ్డిలకు, మరో ఇద్దరు నాయకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నెల్లూరు జిల్లా ఓదార్పు యాత్ర ప్రారంభం కాక ముందే వారిపై చర్యలు తీసుకోవడం వెనక నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పాత్ర ఉందని అంటున్నారు.

నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి క్షణం పడేది కాదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జాతీయ స్థాయిలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి సరైన అవకాశాలు దక్కకుండా వైయస్ ప్రధాన పాత్ర పోషించారని అంటారు. అలాగే, నేదురుమల్లి భార్య రాజ్యలక్ష్మి శాసనసభ ఎన్నికల్లో ఓడిపోవడం వెనక వైయస్ పాత్ర ఉందని చెబుతారు. నెల్లూరు జిల్లాలో నేదురుమల్లికి వ్యతిరేకంగా వైయస్ తన సొంత లాబీని బలంగా తయారు చేశారు. దీంతో వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పనిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తొలుత వైయస్ జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చిన ఆనం బ్రదర్స్ ఇప్పుడు వ్యతిరేకంగా మారారు. మంత్రి రామనారాయణ రెడ్డి, శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి ఓదార్పు యాత్రలో పాల్గొనడం లేదు. వారిని బుజ్జగించడానికి వైయస్ జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. వైయస్ జగన్ ఓదార్పు యాత్రకే ఎసరు పెట్టేందుకు నేదురుమల్లి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

No comments: