నేడు నెల్లూరు

Thursday, October 28, 2010

నెల్లూరు రోడ్ల యడల్పుకు కసరత్తు

నెల్లూరు నగరంలో రోడ్ల విస్తరణకు కసరత్తు జరుగుతోంది. పెరుగుతున్న నగరానికి అనుగుణంగా రోడ్ల వ్యవస్థ లేదు. నిత్యం ట్రాఫిక్ ఇక్కట్లతో అవస్థలు ఎదురవుతున్నాయి.. ఈ సమస్యపై మున్సిపల్ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రూరల్, నగర శాసన సభ్యులు ఆనం వివేకానందరెడ్డి, ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డిలు కొంత మేర దృష్టి సాధించారు. నగరంలో ట్రాఫిక్ ఇక్కట్లు ఎక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాల రోడ్లను విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నారు. వీటికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయించారు. నగరంలో ప్రముఖ వ్యాపార కేంద్రమైన స్టోన్‌హౌస్‌పేట నుంచి జిల్లా వ్యాప్తంగా ఫల సరుకుల వ్యాపారం సాగుతోంది.

ఈ ప్రాంతానికి సరుకుల రవాణ కు సంబంధించి వందలాది వాహనాలు వస్తున్నాయి. డెభై, యనభై ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన 30 అడుగుల రోడ్డు మాత్రమే నేటికి ఆధారం. ఏడు దశాబ్ధాల కిందట జనాభా, వాహనాల సంఖ్య పది రెట్లు కంటే ఎక్కువగా పెరిగింది. రోడ్ల విస్తరణ జరగలేదు. దీంతో ఆ ప్రాంతం నిత్యం రద్దీతో ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఆ ప్రాంతమంతా వ్యాపార కేంద్రాలు కావడం, దుకాణాలు ముందు సరుకుల రవాణాకు చెక్క రిక్షాలు, ఆటోలు నిలపాల్సి ఉండడంతో ట్రాఫిక్ ఇక్కట్లు మరింత ఎక్కువయ్యాయి.

అలాగే ఆ ప్రాంతానికి వెళ్లే ప్రజలకు పార్కింగ్ సౌకర్యం కూడా లేదు. వాహనాలను రోడ్లపై అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసుకుంటున్నారు. సర్వేపల్లి కాలువ బ్రిడ్జి సైతం 20 అడుగులు ఉండడంతో మరింత ఇబ్బందికరంగా మారింది. నగర శాసన సభ్యుడిగా ముంగమూరు శ్రీ«ధర్‌కృష్ణారెడ్డి ఎన్నికైన తరువాత స్టోన్‌హౌస్‌పేట రోడ్డు విస్తరణపై దృష్టి సారించి మంత్రి ఆనం దృష్టికి తీసుకెళ్లారు. పలు సభల్లోనూ ఈ విషయాన్ని ప్రస్తావించి సహకరించాల్సిందిగా కోరారు. దీనిపై స్పందించిన మంత్రి ఆనం స్టోన్‌హౌస్‌పేట రోడ్డు విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బ్రిడ్జితో పాటు రోడ్డు విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దీంతో ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి.

No comments: