నేడు నెల్లూరు

Thursday, October 28, 2010

జగన్‌.. సొంత పార్టీ వైపే అడుగులు

తండ్రి మృతి చెందిన మరుక్షణం నుంచీ ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసి, ఆ లక్ష్యసాధన కోసం కంటిమీద కును కు లేకుండా పనిచేస్తూ, ముఖ్యమంత్రి రోశయ్య పీఠానికి ఎసరు పెట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్న కడప ఎంపీ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజ శేఖరరెడ్డి తనయడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి ఇక సొంత పార్టీనే దిక్కయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన సైతం ఆ దిశగానే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు జగన్‌ శిబిరం సమాచారం. వైఎస్‌ మృతి చెందిన తర్వాత జగన్‌కు ఎంత తీవ్రమైన మద్దతు వ్యక్తమ యిందో, ఇప్పుడు అదే మద్దతు అంత పేలవంగా కనిపిస్తోంది.

ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని సంతకాలు చేసిన ఎమ్మెల్యేల్లో ఇప్పుడు అరడజను మంది తప్ప, మిగిలిన వారంతా భూతద్దం వేసి వెతికినా కనిపించకపోవడంతో జగన్‌ శిబిరంలో నిరాశా, నిస్పృహలు ఆవ హించాయి. సొంత పత్రికలో సొంత వర్గీయుల ప్రకటనలు తప్ప, మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా జగన్‌కు సంబంధించిన గళమే వినిపించడం లేదు. అది కూడా ఆ అరడజను మందే కనిపిస్తు న్నారు. చివరకు హంగూ ఆర్భాటాలతోమొదలుపెట్టిన ఓదార్పు యాత్ర సైతం అత్యంత పేలవంగా సాగు తోంది. మీడియా సైతం దానికి మునుపటి మాదిరిగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం, చర్చల్లో కూడా ఎక్కడా ఓదార్పు ముచ్చట్లు విని పించకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. ఓదార్పు యాత్రకు భారీగా ఖర్చు పెట్టుకుని, రోజులు వెళ్లదీస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ప్రస్తుతం జగన్‌కు అరడజను మంది ఎమ్మెల్యేలు తప్ప మిగి లిన వారి మద్దతు లేదని సొంత వర్గం నేతలే అంతర్గతంగా అంగీ కరిస్తున్నారు. ఇక ఎంపీల్లో సబ్బం హరి, మేకపాటి మినహా మరెవరూ మద్దతునివ్వడం లేదు. తండ్రి ఆత్మబంధువయిన కేవీపీ రామచంద్రరావు కూడా జగన్‌ మొండివైఖరికి విసిగి వేసారి పోయి ఆయనను విడిచిపెట్టి, సొంత రాజకీయ ఎదుగుదల కోసం ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు సైతం.. జగన్‌తో ఉంటే పార్టీ అధిష్ఠానం ఆగ్రహానికి గురికావలసి ఉంటుందని తెలియడంతో వారు కూడా మొఖం చాటేసుకుంటున్నారు.

ఇక తాజాగా యువజన కాంగ్రెస్‌ నాయకులను కూడా పార్టీ నాయకత్వం నియంత్రించడం ప్రారంభించడంతో జగన్‌ ఉక్కిరి బిక్కిరయి ఒంటరిగా మారిపోయారు. ఇంతవరకూ ఎమ్మెల్యేలు తన ఓదార్పు యాత్రకు రాకపోతే.. వారి తర్వాత శ్రేణులు, ప్రధానంగా బలమైన యూత్‌ కాంగ్రెస్‌ నేతలపై వల విసరడం ద్వారా, ఎమ్మెల్యేలను బలవంతంగా దారికి తెచ్చుకోవడంలో విజయవంతమైన జగన్‌ వ్యూహం.. తాజాగా బెడిసికొట్టడంతో ఖంగుతినవలసి వచ్చింది. జగన్‌ మద్దతుదారులయిన యూత్‌ కాంగ్రెస్‌ నేతల పదవులన్నింటినీ రద్దు చేయడంతో, జగన్‌కు ఇప్పటివరకూ ఉన్న ఆ కాస్త మద్దతు కూడా మాయమయింది.

ప్రస్తుతం యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు తమ పదవుల కోసం తప్ప, జగన్‌ కోసం పనిచేసేందుకు సమయం కేటాయించే పరిస్థితి లేదు. జగన్‌కు ఇప్పటిదాకా దన్నుగా నిలిచిన యూత్‌ కాంగ్రెస్‌ ప్రముఖులకు నాయకత్వం చెక్‌ పెట్టడంతో ఇప్పుడు వారే బలహీనులయ్యారు. ప్రస్తుతానికి కొందరు మంత్రులు మాత్రమే జగన్‌తో తెరచాటు మంతనాలు సాగిస్తున్నారు. వారి శాఖల అంశాలపైనే జగన్‌కు సంబంధించిన మీడియా సంస్థల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తా కథనాలు వెలువడుతున్న విష యం చర్చనీయాంశమయింది. గత కొద్దిరోజులుగా అభయ హస్తం, పావలా వడ్డీకి సంబంధించిన వార్తలు వెలువడుతున్న విషయాన్ని తమ అనుమానాలకు మద్దతుగా ప్రస్తావిస్తున్నారు. వైఎస్‌ జీవించి ఉన్నప్పుడు సైతం పావలా వడ్డీ, అభయహస్తం పథకాలకు బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు స్వల్పమేనని గుర్తు చేస్తున్నారు.

అప్పుడు ఆ పథకాలపై రాని వార్తలు, ఇప్పుడు రోశయ్య సీఎం అయిన తర్వాతే వస్తున్నాయంటే వాటి వెనుక ఏ మంత్రుల హస్తం ఉందో స్పష్టం అవుతోందని కొందరు ఎమ్మె ల్యేలు నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి మంత్రుల వైఖరిపై ముఖ్యమంత్రి గతంలోనే అసంతృప్తి వ్యక్తం చేసినా వారి పనితీరు, జగన్‌కు విధేయతలో మార్పు రాలేదంటున్నారు. పైగా రోశయ్య ప్రభు త్వాన్ని ప్రజల్లో అప్రతిష్ట పాలుచేసేందుకే మంత్రుల హోదాలో మహిళలపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ, వ్యూహాత్మకంగా రోశ య్యను భ్రష్ఠుపట్టిస్తున్నారంటున్నారు. ఇక పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, బాలినేని వంటి మంత్రులు జగన్‌కు బాహాటంగానే తమ మద్దతు ప్రకటిస్తున్నారు.

అటు.. అధిష్ఠానం కూడా రోశయ్యను మార్చే అవకాశాలు సమీప భవిష్యత్తులో లేకపోవడంతో జగన్‌ ముఖ్యమంత్రి పదవిపై పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరయిపోయాయి. పైగా పార్టీ అధినేత్రి.. రోశయ్యపై సానుభూతి చూపించడం, వైఎస్‌ మాదిరిగా కాకుండా ప్రతి అంశాన్నీ తనకు చెప్పి చేయటంతో రోశయ్యనే పూర్తి కాలం కొనసాగించే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు.. ఎమ్మె ల్యేలు, మెజారిటీ మంత్రులు, ఎంపీలు ముఖం చాటేస్తుండటం కూడా జగన్‌ లో ఆందోళన పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో జగన్‌కు సొంత పార్టీ పెట్టడం తప్ప మరో దిక్కు కనిపించడం లేదు. ఇప్పటివరకూ అటు రోశయ్యను, ఇటు చంద్రబాబును, అదే సమయంలో పార్టీలోని వైఎస్‌ ప్రత్యర్థులను ఏకకాలంలో ఎదుర్కుంటున్న జగన్‌ ఆ లక్ష్యంలో పూర్తిగా అలసి పో యారు. ఈ ఒంటరి పోరాటం ఇకపై కష్టమని ఆయన గ్రహిం చినట్లు కనిపిస్తోంది. తన ఓదార్పు యాత్రను పార్టీ నాయకత్వం లెక్కచేయడం లేదంటే, తన ప్రాధాన్యాన్ని అధిష్ఠానం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న వాస్తవాన్ని సైతం ఆయన గ్రహించక పోలేదంటున్నారు.

ఇప్పుడు కూడా సొంత పార్టీ పెట్టకుండా, ఎక్కు వ కాలం అధిష్ఠానాన్ని బెదిరించడానికే పరిమితమయితే అది సాధ్యం కాదని ఆయన అనుచరులు సైతం స్పష్టం చేస్తున్నారు. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నందున పార్టీ పెట్టవచ్చంటున్నా రు. లేకపోతే ఇప్పటివరకూ ఉన్న అభిమానులు, నాయకులు కూడా మిగలరంటున్నారు. సొంత పార్టీ పెడితేనే తన సత్తా చూపించవచ్చని, పార్టీలోనే ఉంటే తనను గుర్తించడం కష్టమన్న వాస్తవాలను ‘అనేక సంఘటనల ద్వారా అనుభవించిన’ జగన్‌.. సొంత పార్టీ వైపే అడుగులు వేస్తున్నారంటున్నారు.

No comments: