నేడు నెల్లూరు

Saturday, October 2, 2010

వైభవంగా ముగిసిన పోలేరమ్మజాతర

వేలాది మంది భక్తుల మధ్య గురువారం సాయంత్రం నిమజ్జనోత్సవంతో వెంకటగిరి పోలేరమ్మ జాతర వైభవంగా ముగిసింది. ప్రతి ఏడు మాదిరిగా ఈసారి కూడా జాతర సాంప్రదాయబద్ధంగా అత్యంత వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి కుమ్మరివీధిలోని అమ్మవారి పుట్టిల్లుగా భావించే కుమ్మరింట్లో అమ్మవారి విగ్రహం తయారు చేసి, అర్ధరాత్రి పనె్నండు గంటల సమయంలో అత్తవారి ఇల్లు ఉన్న జీనిగలవారివీధికి నిరాడంబరంగా తీసుకొచ్చారు. కాంపాళెంలో గాలిగంటల పూజ అనంతరం అమ్మవారికి కళ్లు, దిష్టి చుక్క పెట్టి అలంకరించారు. చప్పరంపై అమ్మవారి విగ్రహాన్ని ఉంచి విద్యుత్ దీపాలు, దివిటీల వెలుతురులో భాజా భజంత్రీల మధ్య వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. గురువారం తెల్లవారేప్పటికి అమ్మవారి విగ్రహం పట్టణ నడుబొడ్డులోని గుడికి చేరుకుంది. గురువారం సాయంత్రం వరకు అమ్మవారిని భక్తుల దర్శనార్థం ఉంచారు. ఈ సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అధికారికంగా అమ్మవారికి బలి ఇచ్చే దున్నపోతును గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో అమ్మవారి గుడికి ప్రక్కన బలి ఇచ్చారు. దాని రక్తంతో కలిపిన అన్నం పొలిగా వెంకటగిరి పొలిమేరల్లో వెదజల్లారు. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని, పంటలు సస్యశ్యామలంగా పండాలని ఈ పొలి వెదజల్లడం ఇక్కడ ఆనవాయితీ. బుధ, గురువారాల్లో గ్రామశక్తికి మొక్కుబడుల పేరుతో వందల సంఖ్యలో పొట్టేళ్లు, మేకలు, వేల సంఖ్యలో కోళ్లు బలి ఇచ్చారు. మద్యనిషేధం ఉన్నా మద్యం అమ్మకాలు చాటుమాటుగా సాగాయి. అమ్మవారిని దర్శించింన ప్రముఖుల్లో టిడిపి జిల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, గూడూరు, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు బల్లి దుర్గాప్రసాద్, పరసారత్నం, శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ కోలా ఆనంద్, తిరుపతి మాజీ శాసనసభ్యులు చదలవాడ కృష్ణమూర్తి, ఆర్డీఓ రామ్మూర్తి, డీఎస్పీ నారాయణరెడ్డి, తహశీల్దార్ సుశీల ఉన్నారు. జాతర సందర్భంగా నెల్లూరు డిఆర్ ఉత్తం అధినేత కొడవలూరు ధనుంజయరెడ్డి భక్తులకు భారీ సంఖ్యలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
దర్శనంలో భక్తులకు ఇబ్బందులు
వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు గుడి వద్ద నానా అవస్థలు పడ్డారు. అనుకున్న విధంగా చర్యలు తీసుకోకపోవడంతో ప్రతిసారి మాదిరిగా ఈసారి కూడా తోపులాట మొదలైంది. పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహించి తమ బంధువులు, డిపార్టుమెంటువారికి దర్శనం చేయించడంతోనే డ్యూటీ ముగిసింది. క్యూలో వృద్ధులు, చిన్నారులు ఎండలో నిలబడి కేకలు వేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
అధిక సంఖ్యలో జంతు బలి
ఈ సంవత్సరం అనుకున్న దానికంటే బంతుబలి అధికంగా జరిగింది. ఒక పక్క జంతుబలి చేయరాదని బ్లూక్రాస్ సొసైటీ, పోలీసులు సంయుక్తంగా చేసిన సూచనలను ఆ చెవిన విని ఈ చెవిన వదిలేసినట్లు ప్రజలు వ్యవహరించారు. గురువారం పట్టణంలో వేల సంఖ్యలో బలి జరిగినా బ్లూక్రాస్ సొసైటీ ఏర్పాటు చేసిన శ్లాటర్ హౌస్‌లో 100 లోపల మాత్రమే జంతువులను బలి చేశారు.

No comments: