నేడు నెల్లూరు

Monday, May 30, 2011

ఆనం, ముఖ్యమంత్రిల మధ్య దూరం పెరుగుతోందా?


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి సంబంధాలు బెడిసినట్లేనా? గత కొద్ది కాలంగా జరుగుతున్న పరిణామాలలో ఆనం రామనారాయణరెడ్డిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కావాలనే దూరంగా పెడుతున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. గతంలో ఆనం రామనారాయణరెడ్డి, ఆయన సోదరుడు వివేకానందరెడ్డి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి, అలాగే సలహాదారు కెవిపి రామచంద్రరావుకు బాగా సన్నిహితంగా ఉండేవారు. రాజశేఖరరెడ్డి మరణం తర్వాత కూడా అదే ప్రకారం కెవిపితో కూడా ఆనం రామనారాయణరెడ్డి సత్సంబందాలు కొనసాగిస్తున్నారు
ఆ కారణమో, మరేమో కాని, కిరణ్ కుమార్ రెడ్డి ఈ మధ్య ఆనం పట్ల కొంత అయిష్టంగా ఉంటున్నట్లు సమాచారం. దానికి ఉదాహరణగా కొన్ని ఘట్టాలు చెబుతున్నారు.గత నెలలో కొన్ని రోజుల క్రిందట ప్లానింగ్ కమిషన్ సమావేశానికి రామనారాయణరెడ్డి లేకుండా వెళ్లడం ఒక ఆధారం అయితే తాజాగా మరో ఘటన జరిగింది. రెండు రోజుల కిందట రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. దానికి సాధారణంగా ముఖ్యమంత్రితోపాటు , రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి కూడా హాజరవుతారు.మంత్రిని కనీసం దీనిపై సంప్రదించలేదని, పోని మీటింగ్ కు రమ్మనిఆహ్వానించలేదని చెబుతున్నారు. తాను లేకుండానే ముఖ్యమంత్రి బ్యాంకర్ల సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడడంతో రామనారాయణరెడ్డి ఆశ్చర్యానికి లోనయ్యారు.దాంతో ఆయన కూడా పునరాలోచనలో పడ్డారని అంటున్నారు. ఒకప్పుడు జగన్ కు సన్నిహితంగా మెలిగినా, ఆ తర్వాత పార్టీ లైన్ కు వచ్చి పార్టీకోసం పనిచేస్తుంటే, నెల్లూరులో మేకపాటి సోదరులను ఎదుర్కుంటుంటే , ముఖ్యమంత్రి తమను విశ్వాసంలోకి తీసుకోకపోవడం ఏమిటని మంత్రి ఆనం
వ్యాఖ్యానిస్తున్నారని చెబుతున్నారు.అసలేం జరిగిందో తెలియడం లేదని ఆయన అంటున్నారట. పైగా ముఖ్యమంత్రి భార్య రాధికా రెడ్డి ఆనంకు దూరపు బందువు కూడా అవుతారు. ఆ సంగతి ఎలా ఉన్నా, రాజకీయంగా కిరణ్ కు గట్టి మద్దతు ఇస్తున్న సమయంలో ఆయన ఇలా వ్యవహరించి, బిన్నమైన సంకేతాలు ఇస్తుండడంతో మంత్రి ఆనం రామానారాయణరెడ్డికి ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడింది.అటు జగన్ తో సంబందాలు తెంచుకుని, ఇటు పార్టీతో అనుబందం పెంచుకుని ఉంటే , ఇప్పుడు ముఖ్యమంత్రి ఇలా దూరంగా ఉంచడంలో అంతరార్ధం ఏమిటో తెలియక తలబట్టుకున్నారు ఆనం సోదరులు.
అయితే ఇలాంటి పరిస్థితులను గతంలో అనేక మార్లు చూసిన రామనారాయణ మౌనంగా కిరణ్ రాజకీయాన్ని గమనిస్తూ ఉండిపోతున్నారట.

No comments: