నేడు నెల్లూరు

Saturday, May 21, 2011

నెల్లూరు జిల్లా వారితో పెళ్లిళ్లు చేయడం మంత్రి చేసిన తప్పా ?

రాష్ట్రమంత్రి డి.కె. అరుణకు తన కుమార్తెలతో అనుకోని చిక్కు వచ్చిపడింది.మరో మంత్రి జూపల్లె కృష్ణారావుకు అరుణకు గద్వాల పంచాయతీ నడుస్తోంది. తన సహకారం లేకుండా గద్వాలలో ఎలా పాదయాత్ర చేస్తావని అరుణ, ఎట్టి పరిస్థితులలో తాను గద్వాలలో పాదయాత్ర చేస్తానని కృష్ణారావు మాట,మాట అనుకుంటున్నారు. ఇద్దరు తమ వాదనలతో అందరిని ఆకట్టుకోవడానికి యత్నిస్తున్నారు. ఇద్దరూ నువ్వు తెలంగాణ ద్రోహి వంటే నవ్వు తెలంగాణ ద్రోహి అని విమర్శించుకుంటున్నారు. ఇంతవరకు ఓ.కె. అయితే కృష్ణారావు ఒక అడుగు ముందుకు వేసి అరుణకు సీమాంధ్ర వారితో సంబంధాలు ఉన్నాయని, వారికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఒక ఆరోపణ చేశారు.దానికి కారణం ఏమిటంటే అరుణ తన ఇద్దరు కుమార్తెలను నెల్లూరు జిల్లాకు చెందిన వారితో పెళ్లిళ్లు చేశారు.దాంతో సీమాంధ్ర కనెక్షన్ ఏర్పడిందన్నది కృష్ణారావు అభియోగం అని అరుణ అంటున్నారు. కుమార్తెల పెళ్ళిళ్లకు , తెలంగాణ కు ముడిపెడతారా అని అరుణ వాపోతున్నారు. తాను గాంధీ భవన్ కు వెళ్లి అజాద్ కలిసి తెలంగాణ కోసం పట్టుబట్టానని ఆమె గుర్తు చేస్తున్నారు.ఇద్దరు మంత్రుల మధ్య ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరడంతో వ్యక్తిగత స్థాయిలో విమర్శలు కురిపించుకుంటున్నారు. అయితే రాజకీయ వివాదాలు, నేతల గొడవలు సంగతి ఎలా ఉన్నా వ్యక్తిగత సంభంధాలను కూడా విమర్శలలోకి తీసుకురావడం ఎంతవరకు సరైనదో అర్ధం కాదు. ఆ మాటకు వస్తే అరుణ ఒక్కరికే సీమాంధ్రవారితో సంబంధాలు లేవు. సీనియర్ నేత, పెద్ద తెలంగాణ ఉద్యమ నేత గా చెప్పుకునే పాల్వాయి గోవర్ధనరెడ్డి కుమార్తెను నెల్లూరు యువకుడికే ఇచ్చారు.అంతేకాదు తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ పక్ష మాజీ నేత విజయరామారావు కుమార్తె గుంటూరు యువకుడిని ప్రేమించి పెళ్లాడారు. ఆ మాటకు వస్తే తెలంగాణ రాస్ట్ర సమితి ముఖ్యనేతలు కొందరికి కూడా సీమాంధ్రలో బంధుత్వాలు ఉన్నాయి. కనుక తెలంగాణ వాదానికి , వ్యక్తిగత సంబంధాలకు లింకు పెట్టి మాట్లాడడం మంచిది కాదేమో.

No comments: