నేడు నెల్లూరు

Monday, May 23, 2011

జొన్నవాడ కామాక్షితాయి స్థల పురాణం

బాధలతో అలమటించే భక్తులను ఆదుకొనే అమ్మగా, మనసులో తలచిన కాంక్షలను తీర్చే కాంక్షితార్థ ప్రదాయనిగా జొన్నవాడ కామాక్షితాయి వెలుగొందుతోంది. జొన్నవాడ కామాక్షితాయిని సేవిస్తే తమ బాధలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి విశేషంగా భక్తులు తరలివచ్చి అమ్మకు వరపడుతుంటారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అమ్మవారు స్వప్న దర్శనంతో కోర్కెలను తీరుస్తారని భక్తుల నమ్మకం. భక్తి శ్రద్ధలతో రెండు పూటలా 41 రోజుల పాటు కామాక్షితాయికి వరపడితే కోర్కెలు తీరుతాయన్న విశ్వాసంతో వందలాది మంది భక్తులు జొన్నవాడలో బస చేస్తుంటారు. ప్రధానంగా అనారోగ్యంతో బాధపడే వారు, అంగవైకల్యం కలిగిన వారు, సంతానలేమి తో బాధపడే వారు అమ్మవారి ఆల యంలో ప్రదక్షణ చేసి ఫలితం పొందారని పలువురు చెబుతుంటారు.

స్థల పురాణం
జొన్నవాడ కామాక్షితాయి ఆలయం ఏర్పాటు వెనుక దాగిన కథ పురాణ గాథల ప్రకారం ఇలా ఉంది. దేవిని యజ్ఞ వాటికలో ఆరాధించే మహామునులు, శ్రీకామాక్షిదేవి చిత్కళను మనస్సులో రూపొందించుకొని, ఆ తర్వాత అదేవిధంగా నిర్మించి దేవి ఉన్న చోటనే ప్రతిష్ఠించారు. ఆ మహామూర్తే నేడు పూజలందుకుంటున్న శ్రీకామాక్షితాయి అని ఉత్తరాఖండంలో పేర్కొని ఉంది. ఎల్లప్పుడూ కరుణ తొణకిసలాడుతున్నందున ఈ దేవికి కామాక్షి అనే పేరు సార్థకమైంది. కామాక్షితాయిని జొన్నవాడ సమీపంలోని పెనుబల్లి గ్రామానికి చెందిన ఒక రైతు భక్తి శ్రద్ధలతో పూ జించేవాడు. ప్రతి శుక్రవారం తనను పూజిస్తే దర్శనమిస్తానంటూ కామాక్షితాయి ఆ రైతుకు వరమిచ్చింది. ఆ భ క్తుడు సంతోషపడి నియమం ప్రకారం ప్రతి శుక్రవారం పాదదర్శనం కావాలని కోరాడు. అప్పటి నుంచి ప్రతి శుక్రవారం కామాక్షితాయి భక్తులకు దర్శనమివ్వసాగింది. నియమం ప్రకారం తన పాదదర్శనమిచ్చే కామాక్షితాయి ఒక శుక్రవారం దర్శనమివ్వడం ఆలస్యమైంది. అందుకు కోపించిన ఆ భక్తుడు 500 ఏళ్లపాటు ఆలయం పాడుబడుతుందని శపించాడు. పెన్నానదిలో వరదలు ఏర్పడి కామాక్షితాయి గుడిని ముంచివేసి ఆ ప్రాంతమంతా ఇసుక మేటలుగా ఏర్పడింది. ఆ తరువాత ఈ ప్రాంతంలో కొందరు ప్రజలు నివాసాలు ఏర్పరచుకొని జీవించసాగారు. ఇసుక తోడినప్పుడు నీరు రావడంతో స్థానికులు గంగమ్మ, యాదమాంబ అని రాతి విగ్రహాన్ని పెట్టి పూజలు చే యడం ప్రారంభించారు. కాలగమనం లో ఇసుక మేటలు తొలగి కామాక్షితా యి ఆలయం బయటపడింది. అప్పటి నుంచి కామాక్షితాయి మళ్లీ పూజ లందుకుంటోంది. గంగమ్మ, యాదమాంబలకు వేరే గుడి నిర్మించారు.

కొడిముద్దలతో సంతాన సాఫల్యం
సంతానలేమితో బాధపడే మహిళలు బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణం నుంచి 11 రోజులపాటు వరపడుతుంటారు. ధ్వజారోహణం, అవరోహణ సమయంలో ఇచ్చే కొడిముద్దలను ప్రసాదంగా స్వీకరిస్తే సంతానం కలుగు
తుందన్న ప్రగాఢ విశ్వాసంతో వందలాది మంది మహిళలు ఈ వ్రతాన్ని బ్రహ్మోత్సవాల సమయంలో చేపడతారు.

No comments: