నేడు నెల్లూరు

Friday, May 20, 2011

ఆకస్మికంగా కిరణ్ కు ఢిల్లీ పిలుపు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా శనివారం ఉదయమే ఢిల్లీ వెళుతుండడం కాంగ్రెస్ వర్గాలలో చర్చనీయాంశం అయింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం మే 22 వ తేదీన డిల్లీ వెళ్లవలసి ఉంది. అనంతపురం వెళ్లి అక్కడ ఎమ్.పి అనంత వెంకట్రామిరెడ్డి ఇంట్లో వివాహానికి హాజరై, అక్కడనుంచి బెంగుళూరు వెళ్లి డిల్లీ విమానం ఎక్కాలి. కాని సడన్ గా కిరణ్ కు పిలుపు రావడం కాస్త సంచలనంగా మారింది. కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ ఛార్జీ గులాం నబీ అజాద్ రెండు రోజుల పర్యటన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రికి పిలువు రావడం అందరి మెదడుకు మేతగా మారింది. ఏ ఏ అంశాలపై కిరణ్ ను పిలిచారు. తెలంగాణ అంశంపై మాట్లాడతారా? లేక జగన్ వర్గం వ్యవహారంలో ఏమి చేయాలన్నదానిపై చర్చిస్తారా? లేక కిరణ్ పై వచ్చిన ఫిర్యాదుల నేపధ్యంలో ఏదైనా తీవ్రమైన చర్యలు చేపడతారా? ఆయన వైఖరి మార్చుకోవడానికి అవసరమైన సలహాలు ఇస్తారా?మంత్రివర్గంలో మార్పులు,చేర్పులకు అవకాశం కల్పిస్తారా? ఇలా రకరకాల విషయాలపై ఊహాగానాలు సాగుతున్నాయి. ఏది ఏమైనా అజాద్ హైదరాబాద్ పర్యటన తర్వాత ఇక్కడి పరిస్థితులపై స్పష్టత చాలావరకు వచ్చిందని, అందువల్ల ఏదో ఒక కార్యాచరణ చేపట్టడానికి సమయం ఆసన్నమైందని, అందువల్లనే ముఖ్యమంత్రిని డిల్లీకి రమ్మని కబురంపారని అంటున్నారు.

No comments: