నేడు నెల్లూరు

Saturday, May 28, 2011

బాలకృష్ణ రూటు వేరు

నందమూరి కుటుంబంలో చీలిక స్పష్టంగానే కనబడుతోంది. ప్రముఖ సినీనటుడు, ఎన్.టి.ఆర్ తనయుడు అయిన నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ కుటుంబ డ్రామాలో పార్టీ అద్యక్షుడు, తన వియ్యంకుడు చంద్రబాబువైపే నిలబడాలని స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్లు కనబడుతోంది. బాలకృష్ణ తన సోదరుడు, రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ తో విబేధిస్తున్నట్లే అర్ధం అవుతోంది. హరికృష్ణ, జూనియర్ ఎన్.టి.ఆర్ లు కలిసి నెక్లస్ రోడ్డుకు వెళ్లి ఎన్.టి.ఆర్ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తే, బాలకృష్ణ వారితో కలిసి వెళ్లినట్లు కనిపించలేదు.కాగా జూనియర్ ఎన్.టి.ఆర్ తాను మహానాడుకు రావడం లేదని ప్రకటించిన కాసేపటికి బాలకృష్ణ మహానాడు ప్రాంగణంలో కనిపించారు. ఆయన అక్కడ ఏర్పాటు చేసిన ఎన్.టి.ఆర్ ఫోటో ఎక్జిబిషన్ ను తిలకించారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ బాలకృష్ణకు అల్లుడు అన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో జూనియర్ ఎన్.టి.ఆర్, లోకేష్ ల వారసత్వ తగాదాలో బాలకృష్ణ సహజంగానే అల్లుడివైపే నిలుస్తారు. ఇప్పు డు అదే జరిగినట్లు కనిపిస్తుంది.కొంతకాలం క్రితం కృష్ణా జిల్లా తెలుగుదేశం వివాదం సందర్భంగా కూడా బాలకృష్ణ చేసిన ప్రకటన కూడా హరికృష్ణకు, ఆయనకు కాస్త తేడా ఉందన్న సంకేతాన్ని ఇచ్చింది. ఇప్పుడు చాలా స్పష్టంగా ఆ భిన్నమైన దారులు కనిపిస్తున్నాయి. జూనియర్ ఎన్.టి.ఆర్ రాకపోయినా, హరికృష్ణ అంటీ,అంటనట్లు ఉంటున్నా బాలకృష్ణ మహానాడు ప్రాంగణానికి రావడం, ఫోటో ఎక్జబిషన్ తిలకించడం, (బహుశా ప్రసంగం కూడా చేయవచ్చు)వంటివాటివల్ల చంద్రబాబుకు కొంతలో కొంత ఉపశమనంగానే భావించాలి.

No comments: