నేడు నెల్లూరు

Friday, July 22, 2011

సీఎం అధికారిక పర్యటనలో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారిక పర్యటనలో భాగంగా ఈనెల 24న నెల్లూరుకు రానున్నారు. జిల్లా అధికార యంత్రాంగం ఏర్పా ట్లలో తలమునకలైంది. ఆయన పర్యటించే ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దుతోంది. పొదలకూరు రోడ్డు, వేదాయపాలెం, కరెంట్ ఆఫీస్ సెంటర్లలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి వీఆర్‌సీ మైదానంలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో అభివృద్ధి స్పష్టంగా కన్పించేలా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దృష్టి సారించారు. అందులో భాగంగా పినాకినీ అతిథి గృహానికి వేళ్లే మార్గంలో రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నారు.

పొదలకూరు రోడ్డు సెంటర్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శిలాఫలకానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇక్కడ రూ. 18 లక్షలతో శిలాఫలకం పైలాన్ పనులు జరుగుతున్నాయి. శిలాఫలకం పైలాన్ చుట్టూ ఆక్రమణలు తొలగించి రూ.10 లక్షలతో రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నారు. ఆ పైలాన్‌కు మూడు వైపులా ఫర్లాంగ్ దూరం మాత్రమే రోడ్డుకు ఇరువైపులా విస్తరణ పనులు చేస్తున్నారు. పొదలకూరు రోడ్డు నుంచి గాంధీనగర్ మీదుగా వేదాయపాలెం సెంటర్ వరకూ అధ్వానంగా ఉన్న రోడ్డుకు మెరుగులు దిద్దుతున్నారు. సంవత్సరాల తరబడి ఆ రోడ్డపై ఉన్న గుంతలతో ప్రయాణికులు నరకం అనుభవించారు. సీఎం ప్రయాణించాల్సి ఉండడంతో ఆ రోడ్డుకు మోక్షం కలిగినట్లైంది. అలాగే వేదాయపాలెం సెంటర్‌లో బాబు జగజ్జీవన్‌రామ్ విగ్రహావిష్కరణ జరుగనుంది. అక్కడ రూ. 9.5 లక్షలతో పైలాన్ పనులు జరుగుతున్నాయి. బొల్లినేని ఆస్పత్రి, నిప్పో సెంటర్లలోని రొడ్లపై ఉన్న గుంతలకు మెరుగులు దిద్దుతున్నారు. కరెంటు ఆఫీసు సెంటర్‌లో దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ విగ్రహాన్ని అవిష్కరించనున్నారు. ఇక్కడ రూ. 32 లక్షలతోపైలాన్ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి.

నాణ్యత గాలికి..
హడావుడిగా జరుగుతున్న రోడ్ల విస్తరణ, ప్యాచ్ పనుల్లో అధికారులకు నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. పొదలకూరు రోడ్డు సెం టర్‌లో రూ. 10 లక్షలతో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు అస్తవ్యస్తంగా మారాయి. ఆక్రమణలు తొలగించే ముందు మట్టిని చదును చేసి రోలర్‌తో పటిష్టం చేయాలి. ఆ తర్వాత వెట్‌మిక్స్ పరిచి తిరిగి రోలర్‌తో పటిష్టం చేయాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా రోలర్‌తో పటిష్టం చేయకుండానే వెట్‌మిక్స్ పరుస్తున్నారు. వెట్‌మిక్స్ రోడ్డుపై పరిచిన తర్వాత తేమ ఆరక ముందే రోలర్‌తో పటిష్టం చేయాలి. అలా జరుగుతున్న దాఖలాలు లేవు. సాధారణంగా బీటీ రోడ్డు వేసే ప్రాంతాల్లో వెట్‌మిక్స్ చదును చేసి రోలర్‌తో పటిష్టం చేసిన తర్వాత ట్రాఫిక్ వదిలేస్తారు. రోడ్డు గట్టిపడిన తర్వాత తారు మిక్స్ చేస్తారు. ప్రస్తుతం అలా కాకుండా నామమాత్రంగా పరి చిన వెట్‌మిక్స్‌పై తారు మిక్స్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. కరెంట్ ఆఫీస్ సెంటర్‌లో బాగున్న తారు రోడ్డుపై మళ్లీ తారు రోడ్డు వేయడం స్థానికుల్ని విస్మయానికి గురి చేస్తోంది. పొదలకూరు రోడ్డు నుంచి గాంధీనగర్ మీదుగా వేదాయపాలెం సెంటర్ వరకూ ప్యాచ్ వర్కు జరుగుతోంది. ఆ పనుల్లో కూడా నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. సీఎం తిరిగే ఒక్క రోజు రోడ్లు బాగుంటే చాలనే చందంగా పనులు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి పర్యటిస్తున్న ప్రాంతాల్లోనే హడావుడి చేస్తున్న అధికాారులు గుంతల రోడ్లతో ప్రయాణికుల పడుతున్న ఇబ్బందులను పట్టించుకోవడం లేదని నగరవాసులు విమర్శిస్తున్నారు.

No comments: