నేడు నెల్లూరు

Wednesday, July 20, 2011

ఎగిసిపడ్డ రియల్ ఎస్టేట్ రంగం నేడు కుదేలైంది

ఉప్పెనలా ఎగిసిపడ్డ రియల్ ఎస్టేట్ రంగం నేడు కుదేలైంది. రెండు నెలలుగా ప్లాట్ల అమ్మకాలు నిలిచిపోయాయి. రేట్లు వస్తాయని భావించి రూ. లక్షల్లో అడ్వాన్సులు పెట్టిన రియల్టర్లు ఏమి చేయాలో దిక్కుతోచక అల్లాడుతున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేని పరిస్థితి నెలకొని ఉంది. పరిస్థితి ఇలానే కొనసాగితే ఆత్మహత్యలే శర ణ్యమని రియల్టర్లు వాపోతున్నారు.

నెల్లూరు(అర్బన్), న్యూస్‌లైన్: నిన్న మొన్నటి వరకూ ఓ వెలుగు వెలిగిన రియల్ భూం బోర్లాపడింది. నెల్లూరు నగరం చుట్టూ 30 కిలోమీటర్ల పరిధిలో వ్యవసాయ భూములను సైతం రియల్ ఎస్టేట్లుగా మార్చేశారు. ఎక్కడిక్కడ పొలాలను చదును చేసి ప్లాట్లుగా మారుస్తున్నారు. నెల్లూరు నగరంతోపాటు గూడూరు, బుచ్చి, ముత్తుకూరు ప్రాంతాల్లో కనుచూపు మేరలోని వ్యవసాయ పొలాలన్నీ రియల్ భూంలో ప్లాట్లుగా మారాయి. కృష్ణాపట్నం పోర్టు, పరిసర ప్రాంతాల్లో పలు ఫ్యాక్టరీలు వెలుస్తున్నాయి. నగర ప్రజలు ఇక్కడ ప్లాట్లు కొనేందుకు మొగ్గు చూపడంతో రియల్ భూం పెరిగింది. ఒక్కసారిగా ప్లాట్ల రేట్లు ఆకాశాన్నంటాయి. పరిసర ప్రాంతాల్లో అంకణం ధర రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకూ పలికింది. విక్రమ సింహపురి యూనివర్సిటీ, జిల్లా జైలు, బుజబుజనెల్లూరు సమీపంలో నిర్మాణాలు చేపట్టడం, ముత్తుకూరురోడ్డు, చింతారెడ్డిపాళెం ప్రాంతాల్లో ఇప్పటికే నారాయణ సూపర్‌స్పెషాలిటీ ఉండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. విమానశ్రయం నగరం సమీపంలోని కొత్తూరులో అని ఒకసారి, దగదర్తి సమీపంలో అని మరోసారి ఊహాగానాలు వచ్చాయి. రియల్టర్ల అత్యాశ, దళారుల మయాజాలంతో పలువురు రైతులు తక్కువ ధరకే తమ భూములను అమ్ముకొన్నారు. దళారుల మధ్య భూములు చేతులు మారడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సొమ్ము చెల్లింపు భారంగా మారింది. ఎస్‌ఈజెడ్‌లతో వ్యవసాయ భూములన్నీ ప్లాట్లుగా మారాయి. ఒక్కసారిగా పెరిగిన ధరలతో ఎకరా రూ. లక్షల్లో విక్రయం జరిగే చోట రూ. కోట్లు పలికాయి.

పుట్టగొడుగుల్లా దళారులు పుట్టుకు రావడంతో వ్యాపారాల చేతులు మారాయి. టోకన్ అడ్వాన్సు కింద రూ. లక్షలు చెల్లించడం, దళారుల చేతులు మారడంతో రూ. లక్షలు విలువ చేసే స్థలాలు రూ. కోట్లు కురిపించాయి. ఇలా మూడు నెలల వ్యవధితో అగ్రిమెంట్లు చేసుకొని వ్యాపారాలు చేపట్టారు. అయితే రెండు నెలల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా మందగించింది. ఉన్న ప్లాట్లను లాభాలు లేకుండా అసలుకే విక్రయిస్తామన్నా కొనేవారే కరువయ్యారు. యాజమానుల నుంచి తీసుకొన్న వ్యవధి ముగుస్తున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. అయితే అంత పెద్ద మొత్తాలు సర్దుబాటు చేయలేక మధ్యవర్తులు అల్లాడుతున్నారు.

రెండు నెలల క్రితం వరకూ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రియల్టర్లు, దళారుల హవా కన్పించింది. రియల్ భూం తగ్గడంతో రెండు నెలలుగా రియల్టర్లు జాడ కనిపించడంలేదు. వెలుస్తున్న లే అవుట్లలో అడ్వాన్సు చెల్లించి దళారులు ప్లాట్లు కొనుగోలు చేస్తారు. వీటిని నిజమైన కొనుగోలు దారుడికి విక్రయించకుండా మళ్లీ దళారులకే విక్రయిస్తుండడంతో ప్లాట్లన్నీ దళారుల చేతుల్లోనే ఉండిపోతున్నాయి. రిజిస్ట్రేషన్ చేసుకొని సొంతానికి వాడుకునే వారు అరుదు. వచ్చినంత మేరకు మధ్యవర్తులకే విక్రయిస్తుండడం, ధరలు అధికం కావడంతో ప్లాట్లు సొంతానికి కొనుగోలు చేసే వ్యక్తులు తగ్గిపోయారు. వ్య వధి ముగుస్తుండడంతో రిజిస్ట్రేషన్ చేసుకోమని స్థలాలు యజమానులు ఒత్తిడి తెస్తున్నారు. ఏం చేయాలో దిక్కుతోచక రియల్టర్లు, మధ్యవర్తులు ఇబ్బందులు పడుతున్నారు.

ప్లాట్ల ధరలు పడిపోయాయి
రెండు, మూడు నెలలుగా నగరంలో ప్లాట్ల ధరలు తగ్గిపోయాయి. ధరలు పెరుగుతాయని ఉద్దేశంతో భూములు కొన్నవారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. లాభం రాకపోయినా కనీసం కొన్న ధరకు కూడా ప్లాట్లు అమ్ముడుపోవట్లేదు. కామయ్య, రియల్ ఎస్టేట్ వ్యాపారి

కొనేందుకు ధైర్యం చాలడంలేదు
రియల్‌బూమ్ ఉన్న సమయంలో ప్లాట్లు కొనేందుకు అడ్వాన్సులు చెల్లించాం. మార్కెట్ పడిపోవడంతో ప్లాట్లను కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మిగతా మొత్తం చెల్లించి ప్లాట్లు కొనేందుకు ధైర్యం చాలడంలేదు. మరోవైపు అడ్వాన్సు చెల్లింపుల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీ పెరిగిపోతున్నాయి. ఏం చేయాలో తోచడం లేదు.
వరదయ్య, మధ్యవర్తి

No comments: