నేడు నెల్లూరు

Friday, July 22, 2011

పాదపూజలు, పల్లకీ సేవలు... అహో! 'ధన'పతి సచ్చిదానందం!

పైసామే 'పరమాత్మ'!
ప్రతి దానికీ ఫిక్స్‌డ్ రేటు.. బేరాలు లేవు!
పాదపూజకు లక్ష.. మ్యూజిక్ థెరపీ పేరిట భక్తులకు శిక్ష
భారీ సెట్టింగుల్లో దర్శనం.. పూజల పేరిట ఆర్భాటం
ఎప్పటికెయ్యది ప్రస్తుతమో.. అప్పటికా వేషం!
ఆధ్యాత్మికత ఓ వ్యాపారం.. రూ. కోట్ల ఆర్జనే లక్ష్యం
కన్నెత్తితే చాలు.. కనకాభిషేకాలు
అడుగడుగు దండాలు.. పల్లకీ సేవలు
దటీజ్.. 'ధన'పతి సచ్చిదానందం!

పక్కపక్కనే రెండు దుకాణాలు ఉంటాయి. ఒక షాపు ఎప్పుడూ కళకళలాడుతుంటుంది. ఇంకో షాపు యజమాని మాత్రం ఈసురోమని ఈగలు తోలుకుంటుంటాడు. కారణం... వ్యాపారం ఒక కళ. ఇది మొదటి షాపు యజమానికి ఉంది. రెండో వ్యాపారికి లేదు. భక్తి వ్యాపారమూ అంతేనండోయ్! కాషాయం కట్టగానే సరిపోదు! భక్తులను ఆకర్షించాలంటే 'కళ' ఉండాలి. గణపతి సచ్చిదానంద స్వామీజీ వద్ద ఈ 'కళ' టన్నులకొద్దీ ఉంది. ఆయన భక్తి సామ్రాజ్యానికి ఆయన సకల కళలే కీలకం. సందర్భాన్ని బట్టి ఆయన గాయకుడవుతారు. భగవద్గీత చెప్పేటప్పుడు శ్రీకృష్ణుడి వేషం కడతారు. కనకాభిషేకాలు, పాదపూజలు, పల్లకీ సేవలు... అహో! ఏమి ఆ లీలా విశేషము! మీరునూ కనుడు!

హైదరాబాద్, జూలై 21 : కంచి వంటి సనాతన పీఠాలు ఉన్నాయి. రామకృష్ణ ఆశ్రమం వంటి సేవా తత్పరత ఉన్న ఆశ్రమాలూ ఉన్నాయి. ఇలాంటి ఆశ్రమాలు, వాటి స్వామీజీల మాట మాత్రమే చెల్లుబాటు అవుతున్న కాలంలో... సొంతంగా ఎదగడమంటే మాటలా? ఇందుకు గణపతి సచ్చిదానంద చాలా తంటాలు పడ్డారు. ఆధునిక ఆధ్యాత్మిక మార్కెటింగ్ వ్యూహాల్ని రచించారు. భక్తిని కొత్తపుంతలు తొక్కించారు. తన పేరు చివర 'సాక్షాత్ భగవత్ స్వరూపుడు' అనే ట్యాగ్ తగిలించుకున్నారు.

ఆయనను చూసి భక్తులు పులకించి పోయారు. శ్రీకృష్ణుడిలా నెమలి పింఛం తగిలించుకుని, భగవద్గీత చెబుతుంటే... గీత అలానే చెప్పాలేమో అనుకున్నారు భక్తులు. ఏడు గుర్రాలు లాగే రథాన్ని పోలిన సెట్టింగులో కూర్చొని దర్శనం ఇస్తే... 'అబ్బ!' అని పులకించిపోయారు. ఇంత భారీ హంగామా నడుస్తుంటే వందో, వెయ్యే ఇస్తే ఏం బావుంటుందని ఘనంగా కానుకలు సమర్పించుకొనేవారు. భారీ కానుకలు సమర్పించేలా భక్తులను 'ట్యూన్' చేసుందుకే స్వామీజీ ఈ సెట్టింగ్‌లు ఏర్పాటు చేసేవారంటే బావుంటుందేమో!

హిందూ సంప్రదాయానికి, ఆంగ్ల సంవత్సరాది.. అంటే జనవరి ఫస్ట్ వేడుకలకు సంబంధం లేదు. కానీ, ఈ సందర్భాన్ని కూడా స్వామీజీ ఉపయోగించుకుంటారు. ఎక్కడో ఒకచోట ఆర్భాటంగా దర్శనం ఇస్తూ, దక్షిణలు, కవర్లు అందుకుంటారు. మూడేళ్ల క్రితం విజయవాడలో కొత్తసంవత్సరం వేడుకల్లో స్వామీజీ నాట్యం చేశారు. కారు టాప్ ఎక్కి మరీ రాక్ అండ్ రోల్ నృత్యం చేశారు. జగ్గీవాసుదేవ్ వంటి ఆధునిక స్వాములకు ఏ మాత్రం తీసిపోను అనే సందేశం పంపారు.

పాదపూజకు లక్ష! దేవుడు ఎప్పుడూ, ఎవరినీ డబ్బు అడగడు! కానీ, సచ్చిదానంద స్వామి రూపంలో ఉన్న ఈ దేవుడు మాత్రం డబ్బు లేనిదే భక్తుల వంక కన్నెత్తయినా చూడడు! సాధారణంగా స్వామీజీలు పాద నమస్కారాలకు అనుమతించరు. కానీ... ఈ స్వామీజీ మాత్రం రేటు కట్టి మరీ పాదాలకు మొక్కించుకుంటారు. పాద దర్శనానికి పదివేలు, పాదపూజ చేసేందుకు 20 వేల నుంచి రెండు లక్షల వరకు ఫీజు పెట్టారు. పదేళ్ల క్రితం స్వామీజీ పాదపూజలు ప్రభంజనంలా జరిగాయి. సంపన్నులు పోటీలు పడి మరీ ఆయనను ఇళ్లకు ఆహ్వానించి, కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నారు.

ఒక దశలో పాదపూజలకు క్రేజ్ పెరగడంతో సర్వాంతర్యామి కానీ స్వామిజీ తనకు బదులుగా తన పాదుకలను పంపి ఫీజు వసూలు చేశారు. ఆ తర్వాత మరికొందరు మోడరన్ గురువుల రాకతో గణపతి సచ్చిదానంద పాద పూజలకు డిమాండ్ తగ్గింది. మన స్వామీజీ గృహ ప్రవేశంలాంటి శుభ కార్యాలకు కూడా వస్తారు! అది కూడా రూ.50 వేల నుంచి లక్ష వరకు ముడుపు చెల్లిస్తేనే! పెద్దలకు తృణమో, పణమో సమర్పించడం మన సంప్రదాయం. కానీ.. ఫిక్స్‌డ్ రేట్లు పెట్టి మరీ డబ్బు వసూలు చేయడం ఏ సంప్రదాయమో తెలియదు.

రాగాలు.. రోగాలు
ఒక్కో స్వామీజీ ఒక్కో 'టెక్నిక్'లో స్పెషలిస్టు! గణపతి సచ్చిదానంద మ్యూజిక్ థెరపీలో 'స్పెషలైజేషన్' చేశారు. అంటే మరేమీ లేదు... రాగాలతో రోగాలు నయం చేసే 'కళ'. అసలు విషయమేమిటంటే, మిగిలిన ఆధునిక స్వామీజీల్లా ధాటిగా ప్రసంగించలేకపోవడం ఈ స్వామి మైనస్ పాయింట్! అందుకే... సంగీతాన్ని ఆశ్రయించారు. అధునిక సంగీత పరికరాలను వాయిస్తూ భజనలు చేయించారు. కీర్తనలు పాడారు. అంతటితో అగకుండా ఆ సంగీతంతో మొండి జబ్బుల్ని కూడా నయం చేస్తాం అంటూ కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.

ఒకసారి హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో అట్టహాసంగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎంట్రీ ఫీజు... అక్షరాలా ఐదు వేల రూపాయలు. ఇద్దరు ఐఏఎస్ అధికారులు మ్యూజిక్ థెరపీ కార్యక్రమాన్ని దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. వేటూరి వంటి రసజ్ఞుల్ని ముందువరసలో కూర్చోపెట్టారు. ప్రముఖ వాద్య విద్వాంసుల్ని వేదిక ఎక్కించి, వాళ్ల చేత పాడించి, మధ్యలో స్వామి స్వరం కలిపి, కార్యక్రమాన్ని రక్తికట్టించారు.

ఆ పాటకు మొండి వ్యాధులు కూడా కట్టలు తెంచుకుని పరార్ మంత్రం జపించాయనే ప్రచారం చాపకింద నీరులా సాగేది. ఆ తర్వాత శిల్పారామంలో కూడా స్వామి మ్యూజిక్ థెరపీ కార్యక్రమం జరిగింది. ఆయన సంగీతానికి జబ్బులు నయం కావడం ఏమో కానీ, సంగీతం అంటేనే భయంవేసే పరిస్థితి వచ్చిందని ఆ రెండు కార్యక్రమాలకు హాజరైన ఓ పెద్దమనిషి వాపోయారు.

కనకాభిషేకాలు.. పల్లకీ సేవలు
గణపతి సచ్చిదానందకు రాష్ట్రంలో గట్టి నెట్‌వర్క్ ఉంది. స్వామీజీ ఇంటికి వస్తే శుభం జరుగుతుంది... పలుకుబడి పెరుగుతుందంటూ ఆ నెట్‌వర్క్‌లోని పెద్దలు ప్రచారం చేసేవారు. ఒకళ్లని చూసి మరొకళ్లు స్వామీజీని ఆహ్వానించి, లక్షలు సమర్పించి తరించేవారు. కనకాభిషేకా లు, పల్లకీ సేవలు జోరుగా సాగాయి. ఆయన వస్తే ఏసీ కార్లు, ఏసీ వస తి ఉండాల్సిందే.

ఇక ఎప్పుడూ వార్తల్లో ఉండడం, డబ్బు వచ్చే ఏ మార్గాన్నీ వదలక పోవడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య. 50 ఆశ్రమా ల్లో ఎప్పుడూ తానే ఉండలేరు కాబట్టి, అన్ని ఆశ్రమాల్లోనూ ఆలయాలు నిర్మించారు. అన్నిచోట్లా భక్తుల నుంచి అంతోఇంతో ముడుతుంటాయి. స్వామి స్వయంగా పాల్గొనే కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉన్నతాధికారులు వచ్చేవారు. 'ఇందరు పెద్దలు వెళుతున్నారు కదా!' అం టూ సామాన్యులూ క్యూ కట్టేవారు. అన్నట్టు... ఆయన తావీదులు, రిబ్బ న్లు, అమ్మవారి బొమ్మలు సృష్టించి భక్తుల్ని అబ్బుర పరిచేవారు.

బోన్సాయ్, మూలికావనం
సంగీతంతో కొత్త ప్రయోగాలు చేసిన ఆయన, మైసూరు ఆశ్రమంలో బోన్సాయ్ మొక్కలతో ఆసియాలోనే అతిపెద్ద వనాన్ని ఏర్పాటు చేశారు. ఆ మొక్కలంటే తనకు ప్రాణం అంటారు. ఓసారి భారీ బోన్సాయ్ ప్రదర్శన ఏర్పాటు చేసి, ప్రముఖులను ఆహ్వానించి హంగామా సృష్టించారు. స్వామీజీ ఏమిటి? ఈ బోన్సాయ్ మొక్కల గొడవేంటి అంటారా? మైసూ ర్ దత్తపీఠంలోగల విశాలమైన మూలికావనంలో ప్రపంచంలో ఎక్కడా లేని అరుదైన మూలికలున్నాయని స్వామి చెబుతారు. నిజం ఎంతో ఆ పెరుమాళ్లుకే తెలియాలి!

No comments: