నేడు నెల్లూరు

Friday, July 22, 2011

సీఎం పర్యటనకు భద్రత కట్టుదిట్టం

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి జిల్లా పర్యటనకు భద్రత కట్టుదిట్టం చేసినట్లు ఐజీ హరీష్‌కుమార్ గుప్తా తెలిపారు. ఈ నెల 24వ తేదీన జరగనున్న సీఎం పర్యటన దృష్ట్యా స్థానిక పోలీసు కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ సీఎం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్పీ బీవీ రమణకుమార్,అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, రూరల్, హోంగార్టు డీఎస్పీలు, రవికుమార్, శ్రీనివాస్ , నగర, రూరల్ సీఐలు వీరాంజనేయరెడ్డి, జయరామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీఎం పర్యటించే ప్రాంతాల పరిశీలన
సీఎం పర్యటించే ప్రాంతాలను ఐజీ హరీష్ కుమార్‌గుప్తా పరిశీలించారు. వెంకటాచలం సమీపంలోని కాకుటూరు దగ్గర ఉన్న పోలీసు ట్రైనింగ్ కళాశాల,విక్రమ సింహపురి వర్సిటీ స్థలం, వేదాయపాళెంలోని బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం, కరెంటుఆఫీసు ప్రాంతంలో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను ఆయన పరిశీలించారు. అక్కడి నుంచి నేరుగా బహిరంగ సభ జరిగే వీఆర్‌సీ ప్రాంగణం చేరుకున్నారు. అక్కడ సభ జరిగే ప్రదేశం , ముఖ్యమంత్రి పాల్గొనే సభావేదికను పరిశీలించారు. అనంతరం నూతన కార్పొరేషన్ కార్యాలయం, పొదలకూరు రోడ్డులోని పైలాన్‌తో పాటుగా కస్తూరిదేవి కళాశాల ప్రాంగణంలో జరిగే సమావేశ ప్రాంగణాన్ని ఐజీ పరిశీలించారు.

డాగ్ స్వ్కాడ్ తనిఖీలు
ముఖ్యమంత్రి ప్రారంభించే వేదాయపాళెం బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం, పొదలకూరు రోడ్డులోని పైలాన్ ప్రదేశం, పోలీసు గ్రౌండులోని హెలిప్యాడ్ ప్రాంతాల్లో డాగ్‌స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి.

వీఎస్‌యూ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్
కాకుటూరు(వెంకటాచలం): సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 24వ తేదీన కాకుటూరులోని విక్రమ సింహపురి వర్సిటీ శంకుస్థాపనకు రానున్న నేపథ్యంలో గురువారం కలెక్టర్ శ్రీధర్,జాయింట్ కలెక్టర్ సౌరబ్‌గౌర్ వర్సిటీ స్థలాన్ని పరిశీలించారు. జాతీయ రహదారి నుంచి హెలిపాడ్ వరకు రోడ్డును నాణ్యతగా నిర్మించాలన్నారు. రోడ్డు కిరువైపులా ఉన్న కంప చెట్లను తొలగించాలన్నారు.వర్షం వచ్చి నా బురద కాకుండా సభా స్థలాన్ని చదు ను చేయించాలని అధికారులను ఆదేశించారు. ఈ స్థల పరిశీలనలో వారి వెంట ఆర్డీఓ మాధవీలత,హౌసింగ్ పీడీ వెంకటేశ్వర్లు రెడ్డి,ఆర్‌అండ్‌బీ ఈఈ నాగమల్లు,రూరల్ డీఎస్పీ రవికుమార్,సీఐ.జయరామసుబ్బారెడ్డి,తహశీల్దారు జనార్ధన్,ఇతర శాఖల అధికారులు ఉన్నారు.

No comments: