నేడు నెల్లూరు

Friday, July 22, 2011

జిల్లా పరిషత్‌కు పాలనాకాలం ముగిసింది, సభ్యులు మాజీలయ్యారు.

స్థానిక సంస్థల పాలనాకాలం ముగిసింది. ఎంపీపీలు, ఎమ్పీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, జెడ్పీ చైర్మన్ మాజీలయ్యారు. ప్రత్యేక అధికారుల నియామకానికి ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక ఆర్డినెన్స్‌కు గురువారం గవర్నర్ ఆమోదమద్ర వేశారు. జిల్లా పరిషత్‌కు కలెక్టర్ ప్రత్యేకాధికారిగా నియమితులయ్యారు. వివిధ శాఖలలో పని చేస్తున్న ఏడీ, డెప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులు మండలాలకు ప్రత్యేకాధికారులుగా నియమితులు కానున్నారు. జిల్లాలో 599 మంది ఎంపీటీసీ సభ్యులు, 46 మంది జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. వారి పదవీ కాలం గురువారంతో ముగిసింది. స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహించక పోవడంతో ప్రత్యేకాధికారులు నియామకం తప్పలేదు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల బాధ్యతలను శుక్రవారం నుంచి ప్రత్యేకాధికారులు నిర్వహించనున్నారు.

ఇక నుంచి జెడ్పీ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ బి. శ్రీధర్ వ్యహ రించనున్నారు. ఆయన పర్యవేక్షణలో మండలాలకు ప్రత్యేకాధికారుల నిమామకానికి సన్నాహాలు చేస్తున్నారు. వ్యవసాయ, పశుసంవర్ధక, దేవాదాయ, సహకార, సాంఘిక, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలలో పని చేసే ఏడీ స్థాయి అధికారులను, రెవెన్యూ శాఖలో పని చేస్తున్న డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులను మండలాల ప్రత్యేకాధికారులుగా నియమించి, ఆ జాబితాను గోప్యంగా ఉంచారు. వారిని కూడా అధికారికంగా గురువారం ప్రకటించాల్సి ఉంది. కలెక్టర్ అందుబాటులో లేక పోవడంతో ఆ ప్రకటనకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. శుక్రవారం జెడ్పీ ప్రత్యేకాధికారిగా జిల్లా కలెక్టర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మండలాల ప్రత్యేకాధికారుల జాబితాను ప్రకటించనున్నట్లు తెలిసింది. ఈ విషయమై జెడ్పీ సీఈఓ జయరామయ్యను సంప్రదించగా మండలాల ప్రత్యేక అధికారులను నియమించామని, శుక్రవారం అధికారికంగా ప్రకటిస్తామన్నారు. మండల పరిషత్‌లకు ప్రత్యేకాధికారులుగా నియమించిన వారితో కలెక్టర్ బి. శ్రీధర్, జెడ్పీ సీఈఓ జయరామయ్య శుక్రవారం సమావేశం కానున్నారు.

No comments: