నేడు నెల్లూరు

Saturday, March 27, 2010

నేదురుమల్లి కుటుంబాల్లో విభేదాలు

రాజ్యసభ సభ్యులు మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి సోదరులు ఎఐసిసి సభ్యులు నేదురుమల్లి పద్మనాభరెడ్డి కుటుంబాల మధ్య విభేదాలు గుప్పుమంటు చివరకు వీధిన పడే స్థాయికి దిగజారాయి. దివంగత పద్మశ్రీ నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి స్థాపించిన విద్యా సంస్థల ద్వారానే నేదురుమల్లి సోదరులు జనార్దన్‌రెడ్డి, పద్మనాభరెడ్డిలు రాజకీయంగా ఆర్ధికంగా బలపడ్డారు. వీరిద్దరికి బాలకృష్ణారెడ్డి స్వయానా పినతండ్రి అవుతారు. బాలకృష్ణారెడ్డి మరణానంతరం విద్యాసంస్థలను నేదురుమల్లి పద్మనాభరెడ్డి నిర్వహిస్తూ వచ్చారు. జనార్దన్‌రెడ్డి మాత్రం రాజకీయంగా ఎదుగుతూ వచ్చారు. ఆ క్రమంలోనే ఇంజనీరింగ్‌ కళాశాలను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలోకి తెచ్చారు.

విద్యాసంస్థలను మాత్రం నేదురుమల్లి పద్మనాభరెడ్డి కుటుంబీకులే నడుపుతూ ఆర్ధికంగా బలపడుతూ వచ్చారు. రెండుమూడు సంవత్సరాల క్రితం దివంగత బాలకృష్ణారెడ్డి కుమారుడు నేదురుమల్లి హిమకుమార్‌రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు విద్యా సంస్థల్లో తమకు భాగస్వామ్యం కల్పించాలంటూ పలుమార్లు నేదురుమల్లి పద్మనాభరెడ్డిపై ప్రత్యక్షంగానే వీధికెక్కారు. అయినా వీరి ప్రయత్నాలు నెరవేరలేదు. పెద్దాయన నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి జోక్యంతో బాలకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు సర్దుకుపోతూ వచ్చారు. ఇటీవలి కాలంలో పద్మనాభరెడ్డి కుమారుడు భానుశేఖర్‌రెడ్డి కరెస్పాండెంట్‌గా ఉన్న ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉద్యోగ సంఘాల నాయకులు యాజమాన్యానికి వివాదం మొదలైంది. ఈ విషయంలోను కళాశాలకు ఉన్న గౌరవం వీధికెక్కింది.

చివరకు సద్దుమణిగింది. కొంత కాలానికి ఉన్నట్లుండి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కుమారుడు రామ్‌కుమార్‌రెడ్డి గురువారం కళాశాలకు వెళ్లి హరిజన విద్యార్ధి ఉద్దారక సంఘం తనను కళాశాల కరెస్పాండెంట్‌గా నియమించిందని ప్రకటించుకుని రికార్డు, చెక్కుబుక్కులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా శుక్రవారం ఎఐసిసి సభ్యులు డాక్టర్‌ నేదురుమల్లి పద్మనాభరెడ్డి తాను హరిజన విద్యార్ధి ఉద్దారక సంఘానికి చైర్మన్‌ నని తనకు తెలియకుండానే కళాశాలోకి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, పట్రా ప్రకాశరావు తదితరులు అక్రమంగా ప్రవేశించారంటూ కోట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ప్రాంతంలో కల కలం రేపింది. అన్నదమ్ముల కుటుంబాల మధ్య విభేదాలు ఇంత తీవ్ర స్థాయిలో ఉంటాయనేది చర్చనీయాంశంగా మారింది. పద్మనాభరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి రాజకీయ ప్రత్యర్ధి అయిన గూడూరు కాంగ్రెస్‌ అభ్యర్ధి పనబాక కృష్ణయ్యకు మద్దతుగా ప్రచారం చేయడం వలనే రెండు కుటుంబాల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో చేరుకుంటున్నాయన్నారు.

దీనికి తోడు గత కొన్ని సంవత్సరాల నుంచే రెండు కుటుంబాల మధ్య విభేదాలు నడుస్తుండడం వల్లే పెదనాన్నకు సామాచారం లేకుండానే రామ్‌కుమార్‌రెడ్డి కళాశాలకు కరెస్పాండెంట్‌ బాధ్యతలు చేపట్టడం దీనిపై నేదురుమల్లి పద్మనాభరెడ్డి ప్రతిగా పోలీస్‌ స్టేషన్‌కు ఎక్కడం బట్టి విభేదాలు ఉన్నాయో అర్ధమవుతోంది. కోట పోలీస్టేషన్‌కు వచ్చిన డాక్టర్‌ నేదురుమల్లి పద్మనాభరెడ్డిని విలేఖరులు కలిసి ప్రశ్నించినా దీనిపై స్పందించకుండా వెళ్లిపోయారు. కాని మనసులో మాత్రం బాధ కొట్టొచ్చినట్లు కనబడుతోంది. 30,40 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వచ్చిన విద్యా సంస్థలను అక్రమంగా లాక్కుంటున్నారన్న బాధ ఆయనలో కనబడింది.

No comments: