నేడు నెల్లూరు

Sunday, March 28, 2010

కలెక్టర్‌ బదిలీకి రంగం సిద్ధం

జిల్లా కలెక్టర్‌ కె.రాంగోపాల్‌ను బదిలీ చేయడానికి జిల్లాకు చెందిన ఒక రాజకీయ వర్గం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. జిల్లాలో వర్గాలకు అతీతంగా అందరినీ కలుపుకుపోతున్నప్పటికీ ఆధిపత్యపోరులో భాగంగా కలెక్టర్‌ను బదిలీ చేసి తమకు అనుకూలంగా ఉండే మరో అధికారిని ఇక్కడకు తీసుకురావాలని ఒక వర్గం యోచిస్తోంది. మరోపక్క రాంగోపాల్‌ జిల్లాకు వచ్చి రెండేళ్లు కావడంతో బదిలీకి అనుకూలత ఏర్పడినట్టు తెలిసింది.

వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిల్లాలో ఆనం వర్గం పట్టు కొనసాగింది. అధికారుల నియామకం నుంచి పార్టీ పదవుల ఎంపిక వరకూ వారి కనుసన్నలలోనే జరిగాయి. అయితే వైఎస్‌ మరణం తరువాత పరిస్థితులు తారుమారయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి వర్గం జిల్లా రాజకీయాల్లో కీలకంగా మారింది. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డితో పాటు సర్వేపల్లి, ఉదయగిరి ఎమ్మెల్యేలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిలు నేదురుమల్లి వర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఎస్పీగా ఉన్న మల్లారెడ్డిని బదిలీ చేసే విషయంలో కూడా నేదురుమల్లి వర్గం మాట చెల్లుబాటైంది. జిల్లాలో శాంతిభద్రతల పరంగా అత్యంత కీలకమైన ఎస్పీ బదిలీ విషయంలో జిల్లా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దృష్టికి రాకపోవడం చర్చనీయంగా మారింది. ప్రస్తుతం కూడా రాంగోపాల్‌ బదిలీ విషయంలో నేదురుమల్లి వర్గం పట్టుగా ఉన్నట్లు తెలుస్తోంది. రాయలసీమ జిల్లాల్లో జాయింట్‌ కలెక్టర్‌ హోదాలో ఉన్న ఐఎఎస్‌ అధికారికి పదోన్నతి కల్పించి నెల్లూరుకు తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కలెక్టర్‌ కె.రాంగోపాల్‌ జిల్లాకు వచ్చినప్పటి నుంచి వివాదరహితుడిగా కొనసాగారు. వైఎస్‌ ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు వచ్చినప్పుడు పలు సందర్భాల్లో రాంగోపాల్‌ పనితీరును ప్రశంసించారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు విషయంలో, ఇందిరమ్మ గృహాల్లో లోపాలు సరిదిద్దడంతో కలెక్టర్‌ రాంగోపాల్‌ ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు.

No comments: