
గూడూరు నుంచి పోటీ చేసిన పనబాక కృష్ణయ్యకు మద్దతు తెలిపినందుకు తన తమ్ముడు తనపై కక్షగట్టాడని మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి సోదరుడు పద్మనాభరెడ్డి ఆరోపించారు. తాను అభివృద్ధి చేసిన ఎన్బీకేఆర్ విద్యా సంస్థలపై ఆయన కుమారుడు రాంకుమార్‌రెడ్డి, మరి కొంత మందితో దాడులు చేయించారన్నారు.
తనకు న్యాయం జరగని పక్షంలో ఉరేసుకుని చస్తానని హెచ్చరించారు. పనబాక కృష్ణయ్యతో కలిసి మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. తనకేదైనా అయితే ప్రభుత్వానిదే బాధ్యత అని పద్మనాభరెడ్డి హెచ్చరించారు. తాను ఎత్తుకుని మోసిన తమ్ముడే ఇలా చేయడం బాధగా ఉందన్నారు.
తనకు న్యాయం జరగని పక్షంలో తన ఆస్తిని, విద్యా సంస్థలను, తన శవాన్ని ఆయననే తీసుకుపొమ్మనాలంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను లేని సమయంలో సిబ్బందిని బెదిరించి తన కార్యాలయంలోని చెక్‌బుక్‌లు, ఎఫ్డీలు తీసుకుపోయి కొంత నగదు కూడా డ్రా చేసుకున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. గూడూరు నుంచి కృష్ణయ్యను ఓడించి టీడీపీ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా ఆయన తనను కోరారని వెల్లడించారు.
1992 నుంచి ఏఐసీసీ సభ్యునిగా ఉన్న తాను కాంగ్రెస్‌కు ద్రోహం చేయలేనన్నానన్నారు. జనార్దనరెడ్డి వ్యతిరేక కార్యకలాపాల వల్ల గూడురుతోపాటు సూళ్లూరుపేట, వెంకటగిరి స్థానాల్లోనూ కాంగ్రెస్ ఓడిపోయిందని ఆరోపించారు. జరిగిన సంగతులు సోనియాగాంధీకి కూడా వివరిస్తానని అన్నారు. జనార్దనరెడ్డిని బహిష్కరిస్తేనేగాని నెల్లూరులో పార్టీ బాగుపడదని పనబాక కృష్ణయ్య అన్నారు.