నేడు నెల్లూరు

Monday, January 31, 2011

లవకుశ నిర్మాత ... అల్లారెడ్డి శంకర్‌రెడ్డి

‘లవకుశ’ - తెలుగు ప్రజలు నెలల తరబడి బళ్లు కట్టుకుని, క్యారేజీలు చేత బట్టుకుని వెళ్లి థియేటర్ల ముందు పడిగాపులు పడి చూసిన సినిమా. తెలుగు సినిమా చరిత్రలో అది సృష్టించిన రికార్డులు, ఆ సినిమాలో రంగులన్ని. ఉత్తమ ప్రాంతీయ చిత్ర విభాగంలో జాతీయ అవార్డు అందుకున్న ఇంత గొప్ప కళాఖండాన్ని నిర్మించిన వ్యక్తి అల్లారెడ్డి శంకర్‌రెడ్డి.
లవకుశ నిర్మాత ... అల్లారెడ్డి శంకర్‌రెడ్డి
5 ఫిబ్రవరి 1931 21 మార్చి 1978



లలితా శివజ్యోతి పిక్చర్స్ వ్యవస్థాపకుడు, అధినేత అయిన అల్లారెడ్డిది శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లావిడవలూరు మండలం నాయుడుపాలెం. 1915 ఫిబ్రవరి 5న భూస్వామ్య కుటుంబంలో జన్మించారు.
1963కు ముందు
తెలుగు సినిమా తెలుపు-నలుపుల సినిమా. తొలిసారి తెలుగు ప్రజలకు లవకుశ రంగులలోకాన్ని చూపించింది. ఆ లోకాన్ని సి.పుల్లయ్య సృజిస్తే.. శంకర్‌రెడ్డి సృష్టించారు.

అసలు ఈ సినిమా విజయం గురించి చెప్పుకోవడానికి ముందు శంకర్‌రెడ్డి పడిన కష్టాలు తెలుసు కోవాలి. ఎందుకంటే అవి నిజంగా సినిమా కష్టాలే. అణా (రూపాయికి పదహారణాలు) కూడా పెద్ద మొత్తంగా భావించే రోజులవి. అప్పట్లో ఈ సినిమాకు అల్లారెడ్డి శంకర్‌రెడ్డి పెట్టడానికి సిద్ధమయిన ఖర్చెంతో తెలుసా... అక్షరాలా 30 లక్షల రూపాయలు. ఆయన ధైర్యానికి ఆనాటి తెలుగు సినీ రంగం నోరెళ్ల బెట్టింది. అప్పటికదే భారీ బడ్జెట్ చిత్రం.

ప్రారంభ కష్టాలు
శంకర్‌రెడ్డి భూస్వామ్య కుటుంబంలో జన్మించినా వ్యాపారవేత్తగా ఎదగాలని ఆలోచించేవారు. లక్నోలో ఎమ్మే, ఎల్‌ఎల్‌బీ చేశారు. న్యాయమూర్తి ఉద్యోగం వచ్చినా చేరలేదు. 1941లో ఆంధ్రదేశంలోనే తొలిసారిగా సెరామిక్ ఫ్యాక్టరీని నెల్లూరులో నెలకొల్పారు. తర్వాత సినీరంగంలోకి వచ్చి లలితా శివజ్యోతి పిక్చర్స్ స్థాపించారు. ఆ బ్యానర్ తొలిచిత్రం ‘మానవత’ (1948). మొదటి ప్రయత్నమే అట్టర్ ఫ్లాప్. స్వగ్రామంలో ఉన్న ఆస్తులు చాలావరకు కరిగిపోయినా కుంగిపోలేదు. తర్వాత తెలుగు, తమిళ భాషల్లో తీసిన మల్టీస్టారర్ మూవీ ‘చరణదాసి’ కాసులు కురిపించింది. ఈ స్ఫూర్తితోనే ఆయన లవకుశ తీశారు.

రంగుల్లో సృష్టించిన పౌరాణికం

నిర్మాతగా తనకు సంబంధం లేకపోయినా సినిమాకు ముందే రామాయణాన్ని అవపోసన పట్టారు. 1958లో ప్రారంభమైన లవకుశ చిత్ర నిర్మాణం 1963 వరకు కొనసాగింది. మధ్యలో చాలాకాలం ఆ సినిమా ఆర్థిక కష్టాలతో ఆగిపోయింది. దీంతో లవకుశులుగా నటించిన పిల్లలు పెద్దవాళ్లయిపోయారు. దర్శకులు పుల్లయ్య అనారోగ్యం బారిన పడ్డారు. నటీనటుల కాల్షీట్లు అయిపోయాయి. చేతిలో డబ్బు లేదు. ఏం చేయాలో దిక్కుతోచలేదు. అయినా ఆయన చిత్ర నిర్మాణం నుంచి వైదొలగలేదు.

మళ్లీ డబ్బులు జమ చేసుకున్నారు. సినిమాను విలక్షణంగా తీర్చిదిద్దడానికి శంకర్‌రెడ్డి తీసుకున్న శ్రద్ధ అపారం. రామారావు వాడిన కిరీటాలు, ఆభరణాలు, దుస్తులు.. అన్నీ ప్రత్యేకంగా బొంబాయిలో తయారు చేయించారు. అప్పటికి అందుబాటులో ఉన్న గొప్ప సాంకేతిక విలువలతో తీశారు. 1963 మార్చి 29న 26 కేంద్రాల్లో విడుదలైన ఈ చిత్రం అన్ని ఊళ్లలో శతదినోత్సవం జరుపుకుని అప్పట్లో సంచలనం సృష్టించింది. మొత్తం 72 కేంద్రాల్లో శత దినోత్సవం, 16 కేంద్రాల్లో రజతోత్సవం చేసుకొంది. 10 కేంద్రాల్లో 250 రోజులు, హైదరాబాద్‌లో 67 వారాలు ఆడింది.

మాయాబజార్ తర్వాత సాంకేతిక విలువలున్న గొప్ప చిత్రంగా తెలుగు సినీ చరిత్రలో లవకుశ నిలిచిపోయింది. దక్షిణాదిలో కోటి రూపాయలు వసూలు చేసిన తొలి చిత్రం ఇదే! పైసల్లో సినిమా టిక్కెట్లు అమ్ముతున్న రోజుల్లో ఈ చిత్రం వసూలు చేసిన సొమ్ము పెరిగిన కరెన్సీ విలువ ప్రకారం చూస్తే ఇప్పటికీ అధిగమించని రికార్డు కిందే లెక్క. లవకుశులను గేవాకలర్‌లో ముస్తాబు చేసిన శంకర్‌రెడ్డి తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.

ఆజానుబాహుడు, తెల్లని గ్లాస్కో పంచె, తెల్లని హాఫ్ షర్టు ధరించే శంకర్‌రెడ్డి అంటే ఎన్టీఆర్‌కు ప్రత్యేక అభిమానం, గౌరవం ఉండేవి.

శంకర్‌రెడ్డికి ఇద్దరు కుమార్తెలు. ఇద్దరినీ తన బావమరిది కుమారులకే ఇచ్చి వివాహం చేశారు. పెద్ద కుమార్తె దేవళ్ల అమృతవల్లి. అమెరికాలో స్థిరపడ్డారు. చిన్న కుమార్తె దేవళ్ల విజయలక్ష్మి. నెల్లూరులోని ఇస్కపాలెంలో నివాసం.

శంకర్‌రెడ్డి నిర్మించిన చిత్రాలు
మానవత (1948)
చరణదాసి (1954)
లవకుశ (1963)
రహస్యం (1978)
సతీ సావిత్రి (1978)

No comments: