నేడు నెల్లూరు

Friday, June 18, 2010

బంగారు వ్యాపారిపై దాడి

నగరంలోని కొరడావీధి ప్రాంతంలో మణి ఆచారి అనే బంగారు వ్యాపారిపై గుర్తు తెలియని ఇద్దరు దుండగులు కర్రలతో దాడి చేసి సుమారు 10లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, నగదు దోచుకెళ్లిన సంఘటన బుధవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. వివరాలు ఇలా వున్నాయి. కొరడా వీధికి చెందిన బంగారు వ్యాపారి మణి చెన్నై బంగారు వ్యాపారస్తుల వద్ద బంగారాన్ని తీసుకుని వచ్చి ఆభరణాలుగా తయారు చేసి తిరిగి చెన్నై వ్యాపారస్తులకు అందిస్తుంటారు. మంగళవారం ఉదయం చెన్నై వెళ్లిన మణి సుమారు 600గ్రాముల బంగారాన్ని తీసుకుని బొకారో ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో నెల్లూరు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. రైల్వే స్టేషన్ వద్ద పార్కు చేసిన తన మోటారు సైకిల్‌ను తీసుకుని మణి ఇంటికి బయలు దేరడంతో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని మోటారు సైకిలుపై వెంబండించి మణి ఇంటి వద్ద చేరుకొనే సరికి కర్రలతో అతని తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి అతను మెడకు తగిలించుకుని ఉన్న బ్యాగ్‌ను దోచుకుని వెళ్లారు. ఆ బ్యాగ్‌లో 600గ్రాముల బంగారం, 36వేలు నగదు ఉండడంతో మణి గట్టిగా కేకలు వేయడంతో చుట్టూ ప్రక్కల స్థానికులు అక్కడకు చేరుకుని దుండగులు కోసం గాలించారు. అయితే ఆ సమయంలోనే కరెంటు పోవడంతో దుండగులు సునాయాసంగా పరారయ్యారు. స్థానికులు మణిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 3వ నగర క్రైం ఎస్సై కృష్ణయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

No comments: