నేడు నెల్లూరు

Monday, May 30, 2011

ఆనం, ముఖ్యమంత్రిల మధ్య దూరం పెరుగుతోందా?


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి సంబంధాలు బెడిసినట్లేనా? గత కొద్ది కాలంగా జరుగుతున్న పరిణామాలలో ఆనం రామనారాయణరెడ్డిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కావాలనే దూరంగా పెడుతున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. గతంలో ఆనం రామనారాయణరెడ్డి, ఆయన సోదరుడు వివేకానందరెడ్డి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి, అలాగే సలహాదారు కెవిపి రామచంద్రరావుకు బాగా సన్నిహితంగా ఉండేవారు. రాజశేఖరరెడ్డి మరణం తర్వాత కూడా అదే ప్రకారం కెవిపితో కూడా ఆనం రామనారాయణరెడ్డి సత్సంబందాలు కొనసాగిస్తున్నారు
ఆ కారణమో, మరేమో కాని, కిరణ్ కుమార్ రెడ్డి ఈ మధ్య ఆనం పట్ల కొంత అయిష్టంగా ఉంటున్నట్లు సమాచారం. దానికి ఉదాహరణగా కొన్ని ఘట్టాలు చెబుతున్నారు.గత నెలలో కొన్ని రోజుల క్రిందట ప్లానింగ్ కమిషన్ సమావేశానికి రామనారాయణరెడ్డి లేకుండా వెళ్లడం ఒక ఆధారం అయితే తాజాగా మరో ఘటన జరిగింది. రెండు రోజుల కిందట రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. దానికి సాధారణంగా ముఖ్యమంత్రితోపాటు , రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి కూడా హాజరవుతారు.మంత్రిని కనీసం దీనిపై సంప్రదించలేదని, పోని మీటింగ్ కు రమ్మనిఆహ్వానించలేదని చెబుతున్నారు. తాను లేకుండానే ముఖ్యమంత్రి బ్యాంకర్ల సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడడంతో రామనారాయణరెడ్డి ఆశ్చర్యానికి లోనయ్యారు.దాంతో ఆయన కూడా పునరాలోచనలో పడ్డారని అంటున్నారు. ఒకప్పుడు జగన్ కు సన్నిహితంగా మెలిగినా, ఆ తర్వాత పార్టీ లైన్ కు వచ్చి పార్టీకోసం పనిచేస్తుంటే, నెల్లూరులో మేకపాటి సోదరులను ఎదుర్కుంటుంటే , ముఖ్యమంత్రి తమను విశ్వాసంలోకి తీసుకోకపోవడం ఏమిటని మంత్రి ఆనం
వ్యాఖ్యానిస్తున్నారని చెబుతున్నారు.అసలేం జరిగిందో తెలియడం లేదని ఆయన అంటున్నారట. పైగా ముఖ్యమంత్రి భార్య రాధికా రెడ్డి ఆనంకు దూరపు బందువు కూడా అవుతారు. ఆ సంగతి ఎలా ఉన్నా, రాజకీయంగా కిరణ్ కు గట్టి మద్దతు ఇస్తున్న సమయంలో ఆయన ఇలా వ్యవహరించి, బిన్నమైన సంకేతాలు ఇస్తుండడంతో మంత్రి ఆనం రామానారాయణరెడ్డికి ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడింది.అటు జగన్ తో సంబందాలు తెంచుకుని, ఇటు పార్టీతో అనుబందం పెంచుకుని ఉంటే , ఇప్పుడు ముఖ్యమంత్రి ఇలా దూరంగా ఉంచడంలో అంతరార్ధం ఏమిటో తెలియక తలబట్టుకున్నారు ఆనం సోదరులు.
అయితే ఇలాంటి పరిస్థితులను గతంలో అనేక మార్లు చూసిన రామనారాయణ మౌనంగా కిరణ్ రాజకీయాన్ని గమనిస్తూ ఉండిపోతున్నారట.

విజయ్ చందర్ కూతురు వనిత నిరాహార దీక్షకు దిగింది

సినీ నటుడు విజయ్ చందర్ కూతురు వనిత, ఆమె మాజీ భర్త ఆకాష్ మధ్య వారి తనయుడు గొడవ కొనసాగుతోంది. తాజాగా వనిత తన తనయుడిని తన వద్దకు పంపించాలని డిమాండ్ చేస్తూ చెన్నైలోని ఆకాష్ ఇంటి ముందు నిరాహార దీక్షకు దిగింది. చెన్నై కోర్టు ఉత్తర్వుల మేరకు తన తనయుడిని తన వద్దకు వారానికి రెండు రోజులైనా పంపించాలని ఆమె డిమాండ్ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఆకాష్ నడుచుకోవడం లేదని తాను పోలీసులను ఆశ్రయించినప్పటికీ వారు నిర్లక్ష్యం వహించాలని ఆమె ఆరోపించింది. అందుకే తాను నిరాహార దీక్షకు దిగానని ఆమె చెబుతోంది. తన కుమారుడిని తన వద్దకు పంపించే వరకు తాను దీక్షను విరమించనని హెచ్చరించింది.

అయితే భర్త ఆకాష్ వర్షన్ మరో రకంగా ఉంది. తన కుమారుడికి తల్లి వద్దకు వెళ్లడం ఇష్ట పడడం లేదని కౌన్సెలింగ్ ఇప్పించేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని, కానీ తల్లి వద్దకు పంపవద్దనే ఉద్దేశ్యం తమకు లేదని ఆకాష్ చెబుతున్నాడు. అయితే తన తనయుడిని చిత్ర హింసలకు గురి చేస్తూ తన వద్దకు రాకుండా చేస్తున్నారని వనిత ఆరోపిస్తోంది. మరో విషయం ఏమంటే వనిత తండ్రి విజయ్ చందర్ కూతుర్ వైపు కాకుండా అల్లుడు ఆకాష్ వైపు ఉండటం విశేషం. వనిత భర్త నుండి విడిపోయాక తన వద్దకు తనయుడిని పంపించక పోవడంతో ఆమె ఏడెనిమిది నెలల క్రితం కోర్టును ఆశ్రయించింది.

అయితే కొడుకుకు తల్లి వద్దకు వెళ్లడం ఇష్టం లేదని గమనించిన కోర్టు వారానికి రెండు రోజులు అంటే శని ఆదివారాలు తల్లి దగ్గరకు పంపించాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. గత కొన్నాళ్లుగా ఆకాష్ - వనితల మధ్య తనయుడి కోసం వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు తనయుడి కోసం వనిత, ఆమె తండ్రి విజయ్ చందర్‌ ఆరు నెలల క్రితం సాక్షాత్తూ చెన్నై విమానాశ్రయంలోనే ప్రయాణీకుల ముందు గొడవ పడ్డారు. అయితే తన మాజీ భర్త సూచనల మేరకే తన తండ్రి ఇలా తనతో గొడవకు దిగుతున్నారని ఆమె చెప్పారు.